సకల సమస్యల పరిష్కారిణి ఈ అమ్మ!!
అమ్మవారి రూపాలు అనేకం. నవదుర్గలు, అష్టలక్ష్ములు ఇలాంటి కోవలోకి వచ్చేదే సప్తమాతృకలు. సప్తమాతృకలు అమ్మవారి ఏడు రూపాలు. ఈ సప్తమాతృకలలో శ్రీ వారాహి కూడా ఒకరు. ఈమె దేవతల అధినాయకి అయిన లలితా పరమేశ్వరి దేవి సైన్యానికి అధ్యక్షురాలు.
వారాహి అమ్మవారిని మహావిష్ణు మరో రూపంగా, మహాలక్ష్మి ప్రతిరూపంగా చూస్తారు. సర్వ మంగళ స్వరూపం అయినా ఈ అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ చేయడానికి చేతిలో పాశమును దండమును ధరించిన దండనాథ. అంటే తప్పులు చేసిన వారిని శిక్షించే దేవత వారాహి అమ్మవారు. అయితే వారాహి అమ్మవారు ఉగ్రరూపంలో ఉండటం చాలా మంది చూసి ఉంటారు కానీ ఈమె వ ఉగ్ర రూపంలో కనిపించే అపార కరుణామయి పరమ కృపామయి. ఆరాధించేవారిని ఎంతో గొప్పగా కరునిస్తుంది ఈ అమ్మ.
అయితే వారాహి దేవత వారాహి ఆరాధన అందరూ చేయకూడదఅని కొన్ని అపోహాలున్నాయి. ఆ అపోహల వలన అమ్మవారి ఆరాధన చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వారాహి అమ్మవారిని ఆరాధించడం అంటే దుష్టశక్తిని ఆశ్రయించడమని, అది ప్రజానీకానికి మంచిది కాదని ఇలా అపోహలు చాలా ఉన్నాయి. అందువల్ల అమ్మవారిని ఆరాధించే విధానం కొద్దీ మందికి తెలిసి ఆ తరువాత ఆ ఆరాధనను అందిపుచ్చుకునేవాళ్లు లేక అలాగే ఎవరికి తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయాయి. అమ్మవారు తాంత్రిక శక్తి అనేది పూర్తిగా సత్యదూరం.
ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మనిషిని వేధించే సమస్యలైన అరిషడ్వర్గాలు అమ్మవారి ఆరాధన చేస్తే అవన్నీ మనిషి చెప్పుచేతల్లో ఉంటాయి. అంటే అరిషడ్వర్గాలు మనిషిని శాసించడం కాకుండా మనిషి వాటిని అణిచిపెట్టుకోగలుగుతాడు. కామ క్రోధ మద మోహ మాత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది. మన మనసును నియంత్రిస్తుంది.
అమ్మవారు సాక్షాత్ వసుంధర భూదేవి. నాగలిని రోకలిని ధరించిన ధాన్య దేవత పంటలు సరిగా పండాలన్న వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధన చేయాలి. ప్రస్తుత కాలంలో రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. వారాహి అమ్మవారి ఆరాధన వల్ల వారి జీవితాలు చక్కబడే అవకాశం ఉంది. అలాగని ఇదేమీ మూర్ఖత్వపు చర్య కాదు. అనవసరమైన ఎరువులకు వేలు పొసే వారు,చిత్తంతో అమ్మవారిని ఆరాధించడం తప్పేమి కాదు కదా. శ్రీకరి శుభకరీ సర్వమంగళ కారిణి కళ్యాణ స్వరూపిణీ అమంగళ నాశిని సుమంగళి కారిని సౌభాగ్య ప్రదాయిని విశుక్ర ప్రాణ హరిని వారాహి అమ్మవారు. ఇన్ని విధాల కరుణకు కలిగించే ఒకే ఒక దేవత వారాహి అమ్మవారు. అలాంటి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్య ప్రదం ఎటువంటి తీవ్ర సమస్యలైన అమ్మవారి ఆరాధన వల్ల పరిష్కారం లభిస్తుంది.
కాబట్టి వారాహి మాతను ఆరాధించడం సమస్యల పరిష్కారానికి, మానసిక సమస్యలు తొలగించుకో వడానికి గొప్ప మార్గం.
◆ వెంకటేష్ పువ్వాడ