ఆధ్యాత్మిక అవరోధం దాటాలంటే ఏమి చేయాలో తెలుసా!
శారీరక, మానసిక స్థాయిల్లో ఎంతోమంది ఎన్నో సంతోషాలు పొందుతూ ఉంటారు. కానీ అవన్నీ నిజమైన సంతోషాలు కాదు. నిజమైన ఆనందం అంతరాత్మ నుంచే లభిస్తుంది. ఈ జన్మలోనే ఆ అనంత ఆత్మానందాన్ని పొందాలి అని నచికేతునిలా దృఢసంకల్పం ఉంటే ఈ భౌతిక సుఖాలు మనస్సుని జీవిత లక్ష్యం నుంచి మరల్చలేవు. సముద్రం లోనికి ఎన్ని నదులు వచ్చిచేరినా సముద్రం మాత్రం ఎటువంటి అలజడికి లోనుకాదు. అలాగే దృఢచిత్తం కలవాడిలో ఎన్ని కోర్కెలు ఉదయించినా అవి అతణ్ణి చలింపజేయలేవు. పరమ ప్రశాంత చిత్తంతోవున్న అవధూతను చూసి యదు మహారాజు
జనేషు దహ్యమానేషు కామలోభ దావాగ్నినా । న తప్యసే అగ్నినా ముక్తో గంగాంభః స్థ ఇవ ద్విపః ॥
మానవులు కామలోభాలనే దావాగ్నిలో తపించి పోతుంటే, గంగానదిలో ఏనుగువలే నిశ్చలంగా, ప్రశాంతంగా ఎలావున్నావని అవధూతను ప్రశ్నిస్తాడు.
అశాంతికి కారణం మమకారమే దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుంటే..
ఓ వీథిలో యువతి వాకిలి శుభ్రం చేస్తూ ఉంటుంది. అటుగా వెళుతున్న ఒకతను 'ఎవరో బాలుడు చనిపోయాడట' అని చెప్పి వెళ్లిపోతాడు. 'పాపం, కాలం తీరిపోయింది... అనుకుంటూ యథావిధిగా తన పనిలో తాను నిమగ్నమవుతుంది ఆ యువతి. కొద్దిసేపట్లో చనిపోయిన బాలుడు తన కొడుకేనని తెలిసేసరికి ఆమె గుండెపగిలేలా రోదిస్తూ మూర్ఛపోతుంది. ఇదే మమకార బంధమంటే. అప్పటి వరకు బాలుడి మరణాన్ని సహజంగా తీసుకున్న యువతి, 'తన' అని తెలిసేసరికి బాధ కట్టలు తెంచుకుంది. అలాంటి భవబంధాల నుంచే బయటపడాలి.
అయంతు పరమోధర్మో యత్ యోగేన ఆత్మదర్శనం ఆత్మానుభవం పొందడమే జీవిత పరమ ధర్మం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ ఆత్మానందం పొందటానికి 'సమచిత్తం' అవసరం. సమచిత్తం బంధరాహిత్యం వలనే సాధ్యం. ఆ ప్రయత్నంలో మనం ఒక్క అడుగైనా ముందుకు వేస్తే, భగవంతుడు పది అడుగులు ముందుకు వచ్చి మనకు చేయూతనిస్తాడు.
మానసిక ఒత్తిళ్ళనూ, అలజడులనూ దాటి ఆనంద తీరాన్ని చేరడానికి కనీసం ఒక్క అడుగైనా ముందుకు వేయాలి. మన వంతు ప్రయత్నం చేయాలి.
◆నిశ్శబ్ద.