శ్రావణ పూర్ణమి రోజే రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు..!
.webp)
తెలుగువారికి, అలాగే భారతీయ సంస్కృతిలో శ్రావణ మాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజూ ఒక పండుగలాగే అనిపిస్తుంది. అయితే, శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పూర్ణమిని అందరూ రాఖీ పూర్ణమిగానే పిలుచుకుంటారు. కానీ దీన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అసలు శ్రావణ పూర్ణమి నాడే రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజున ఉన్న ఇతర ప్రత్యేకతలు ఏమిటి? వివరంగా తెలుసుకుంటే..
శ్రావణ పూర్ణమి రోజే రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు?
హిందూ ధర్మం ప్రకారం శ్రావణ పూర్ణమి ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున సోదర-సోదరీమణుల అనురాగానికి సంకేతంగా రాఖీ పండుగను జరుపుకోవడానికి పురాణాల్లో, చరిత్రలో కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
శ్రీకృష్ణుడు - ద్రౌపది వృత్తాంతం..
పురాణాల ప్రకారం, శిశుపాలుని వధించే క్రమంలో శ్రీకృష్ణుని వేలికి గాయమై రక్తం కారుతుంది. అది చూసిన ద్రౌపది తక్షణమే తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుని వేలికి కడుతుంది. ఆ ప్రేమానురాగానికి మైమరచిన శ్రీకృష్ణుడు, ఆమెను ఎల్లవేళలా ఆదుకుంటానని అభయమిస్తాడు. ఈ సంఘటన జరిగిన రోజు శ్రావణ పౌర్ణమి. ఆ తర్వాత.. కౌరవ సభలో ద్రౌపదికి వస్త్రపహరణం జరుగుతున్న వేళ, శ్రీకృష్ణుడు అభయం ఇచ్చి ఆమె మానాన్ని కాపాడతాడు. అందుకే ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల రక్షణ కోరుతూ రాఖీ కట్టే ఆచారం ప్రారంభమైంది.
లక్ష్మీదేవి - బలిచక్రవర్తి కథ..
మరొక కథనం ప్రకారం, విష్ణుమూర్తి వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కి, ఆయన భక్తికి మెచ్చి పాతాళంలో బలిచక్రవర్తి వద్దే ఉండిపోతాడు. దీంతో వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి శ్రావణ పౌర్ణమి రోజున సాధారణ స్త్రీ రూపంలో పాతాళానికి వెళ్లి, బలిచక్రవర్తికి రక్షారూపంలో దారాన్ని కడుతుంది. బలిచక్రవర్తి దానికి సంతోషించి ఏమి కావాలో కోరుకోమనగా, లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వైకుంఠానికి పంపమని కోరుతుంది. మాట ఇచ్చిన కారణంగా బలిచక్రవర్తి విష్ణుమూర్తిని వైకుంఠానికి పంపుతాడు.
శ్రావణ పూర్ణమి అంటే కేవలం రాఖీ పండుగ మాత్రమే కాదు. భిన్న సాంప్రదాయాలు, వృత్తుల వారికి కూడా ఈ రోజు అత్యంత ప్రాముఖ్యత ఉంది.
జంధ్యాల పౌర్ణమి ..
ద్విజులు అంటే.. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు.. ఈ రోజున పాత యజ్ఞోపవీతాన్ని అంటే జంధ్యాన్ని తీసివేసి, నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. వేదాధ్యయనం ప్రారంభించడానికి ఈ రోజును అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు.
హయగ్రీవ జయంతి..
జ్ఞానానికి, విద్యకు అధిపతి అయిన శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీ హయగ్రీవ స్వామి జన్మించిన రోజు కూడా శ్రావణ పౌర్ణమియే. అందుకే విద్యార్థులు, పండితులు ఈ రోజున హయగ్రీవుడిని పూజిస్తే జ్ఞానం, జ్ఞాపకశక్తి పెరుగుతాయని నమ్ముతారు.
నారికేళ పౌర్ణమి..
నారికేళ పౌర్ణమి రోజు చేపల వేట ప్రారంభం అవుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు శ్రావణ పూర్ణమిని నారికేళ పౌర్ణమిగా జరుపుకుంటారు. వర్షాకాలంలో సముద్ర వేటకు దూరంగా ఉన్న మత్స్యకారులు, ఈ రోజున సముద్రునికి, వరుణ దేవునికి కొబ్బరికాయలు అంటే నారికేళం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు నుంచే వారు తిరిగి సముద్ర వేటను ప్రారంభిస్తారు.
సంస్కృత దినోత్సవం..
మన ప్రాచీన భాష అయిన సంస్కృతం విశిష్టతను చాటడానికి భారత ప్రభుత్వం శ్రావణ పూర్ణమి రోజును అంతర్జాతీయ సంస్కృత దినోత్సవంగా ప్రకటించింది.
అమర్నాథ్ యాత్ర సమాప్తం..
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమర్నాథ్ మంచు లింగ దర్శన యాత్ర శ్రావణ పౌర్ణమి నాడే అధికారికంగా పూర్తవుతుంది. ఈ రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ముగిస్తారు.
చివరగా..
శ్రావణ పూర్ణమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ప్రేమానురాగాలు, సాంస్కృతిక సనాతన ధర్మాలు, వేదాధ్యయనం , ప్రకృతి పట్ల గౌరవాన్ని చాటిచెప్పే ఒక పవిత్రమైన రోజు. అటు కుటుంబ బంధాలను బలోపేతం చేస్తూ, ఇటు దైవ చింతనను పెంపొందించే శ్రావణ పౌర్ణమి భారతీయులందరికీ ఎంతో ప్రత్యేకమైనది!
*రూపశ్రీ.


