కర్తవ్య ప్రాముఖ్యత తెలిపే శ్లోకం!!
కొందరు కొన్ని పనులు చెయ్యాలి అంటే ఏవేవో భయాలతోనూ, అర్థం పర్థం లేని కారణాలతోనూ ఆ పనిని చేయకుండా వదిలేయాలి అనుకుంటారు. కానీ అలా చేయాల్సిన పని కర్మ అయినపుడు దాన్ని తప్పక చెయ్యాలి కదా!! గీతలో అర్జునుడికి కృష్ణుడు అదే చెబుతాడు.
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్|
తథాపి త్వం మహాబాహో నైనం శోచితు మర్షసి||
అర్జునా! నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే, ఆత్మకు కూడా పుట్టుక, చావు ఉంటాయని నీవు నమ్ముతుంటే, ఆవిధంగా కూడా నీవు ఈ విధంగా ఏడవడానికి వీలు లేదు.
నీవు అనుకుంటున్నట్టు ఈ శరీరమే ప్రధానము అనేది నిజమైతే కూడా నీవు శోకించడానికి అర్హుడవు కావు.
ఈ శ్లోకంలో కృష్ణుడు ఒక ఊహాజనితమైన వాదన వినిపిస్తున్నాడు. ఈ పదాలను మామూలుగా కోర్టులలో వాడుతుంటారు. "అజ్యూమింగ్ ఫార్ ఎ మూమెంట్", అనీ "ఫార్ ఆర్యుమెంట్ సేక్" అనీ అంటూ ఉంటారు. ఒక వేళ ఇలా జరిగింది అని అనుకుంటే కూడా అది సరికాదు అని చెప్పడం. అలాగే కృష్ణుడు కూడా అర్జునుడిని ఊహించమంటున్నాడు. ఎందుకంటే హిందూధర్మంలో అసలు విషయం అన్నికోణాల నుండి చెబుతారు. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. ఇది నువ్వు నమ్మాలి అని ఖచ్చితంగా చెప్పదు. అందుకని కృష్ణుడు ఇన్ని విధాలు అర్జునుడిని కన్విన్స్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.
కృష్ణుడు చెప్పినట్టు ఆత్మ నిత్యం, సత్యం, అవ్యక్తం, అచింత్యం, అధికారం, అని మనం నమ్మడం లేదనుకో ఏం ఇబ్బంది లేదు. చాలా మంది దేవుడు ఉన్నాడని నమ్మరు. ఇంకా వేదములను నమ్మరు. వేదాంతం అంతా చెత్త అనేవాళ్లు ఉన్నారు. చార్వాకుడు ఒక మతాన్ని కనిపెట్టాడు. చార్వాకమతం అంటారు. ఆత్మ కనిపించదు కాబట్టి ఆత్మ లేదు. దేవుడు కనిపించడు కాబట్టి దేవుడు లేడు. శరీరం కనిపిస్తుంది కాబట్టి శరీరం మాత్రమే ఉంది. అని అంటారు చార్వాకులు. అంటే కళ్ళకు కనిపించేది మాత్రమే ఉన్నట్లయితే మనం పీలుస్తున్న ఈ గాలి మాటేమిటి?? కళ్ళకు కనిపించని మనసుతో మాత్రమే ఆస్వాదించగల అనుభూతుల మాటేమిటి?? అవన్నీ లేనట్టేనా?? ఉషోదయానికి, అస్తమయానికి తరువాత సూర్యుడు కనిపించడు మరి సూర్యుడు లేనట్టా?? తన చలనంతో వేరే ఎక్కడో ఉన్నాడని అర్థం కాదా?? కానీ లేడని చెబుతుందా చార్వాక మతం. అవునూ మనిషి ఆలోచన కూడా ఇంతేనా?? విశ్లేషణాత్మకంగా, విశ్వానికి అతీతమైన అదృశ్య శక్తి రూపమైన భగవంతుడిని గూర్చి మూర్ఖంగా ఆలోచిస్తారెందుకు??
కళ్ళకు కనబడలేదు కాబట్టి లేదు అని మూర్ఖపు ఆలోచన నుండి బయటకు ఎప్పుడొస్తాడు?? ఇదిగో ల్ బయటకు వచ్చే మార్గమే కదా భగవానుడు చెబుతున్నాడు.
"అర్జునా! నీవు శరీరమే ఆత్మ అనుకున్నప్పటికీ, ఆత్మ కూడా శరీరంతో పాటు పుడుతూ చస్తూ ఉంటుంది అని నీవు అనుకుంటే కూడా, నీవు ఈ విధంగా శోకించడానికి అర్హుడవు కావు. నీవు యుద్ధం చెయ్యాల్సిందే. తప్పదు." అని అన్నాడు.
దీని అర్ధం ఒకటే ఈ శరీరం గురించి, బయటి వ్యక్తుల గురించి, ఆ భగవంతుడి గురించి ఎవరు ఏమి అనుకున్న వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నెరవేర్చాల్సిందే!!
◆ వెంకటేష్ పువ్వాడ