మిథున రాశి:- (కా, కి, కు, ఖం, జ, ఛ, కే, కో, హ)
ఆదాయం : 11 వ్యయం : 5 - రాజపూజ్యం : 2, అవమానం : 2
వీరికి ఈ సంవత్సరము శని అష్టమ, భాగ్యరాశులలో సంచరించును కావున మిక్కిలి శ్రమకరమగు కాలము. ప్రయత్నించిననూ కార్యములు సానుకూలపడవు. ధనవ్యయమగును. ప్రమాదములు, అపనిందలు, గౌరవహాని కలుగును. కళత్ర పుత్రమూలక వ్యధ, ఒకప్పుడు ధనలాభము కలుగును. చైత్ర బహుళం నుండి దశమ గురువు అయినందున వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల యందు చిక్కులు, ఆస్తినష్టం, సంతతిపీడ, గౌరవభంగం, వృథా ప్రయాణములు, స్వజన విరోధములు కలుగును. చైత్ర బహుళం నుండి ఏకాదశ రాహువు, పంచమ కేతువు అయినందున, లాభము, జయము, ప్రోత్సాహము, గౌరవమర్యాదలు, సన్మానము, పుత్రవిరోధము కలుగును. శ్రావణ బహుళం నుండి సంవత్సరాంతము వరకు కుజుడు వ్యయ, జన్మరాశులలో సంచరించును కావున జాగ్రత్తగా నుండవలయును.
మృగశిర వారికి ఆశ్వయుజం నుండి మార్గశిరం వరకు, తిరిగి ఫాల్గునమందు జన్మతార యందు కుజుడు, సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ శుక్లం వరకు, తిరిగి కార్తిక బహుళం నుండి సంవత్సరాంతము వరకు జన్మతార యందు శని, జ్యేష్ఠ బహుళం నుండి మాఘ బహుళం వరకు నైధనతార యందు రాహువు సంచరించుదురు. ఆర్ధ వారికి జ్యేష్ఠ శుక్లం వరకు నైధనతార యందు రాహువు, ఆశ్వయుజ బహుళం వరకు జన్మతార యందు కేతువు సంచరించుదురు. పునర్వసు వారికి మార్గశిర బహుళం నుండి మాఘ బహుళం వరకు నైధనతార యందు కుజుడు, ఆశ్వయుజ బహుళం నుండి కార్తిక శుక్లం వరకు నైధనతార యందు శని, సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ బహుళం వరకు జన్మతార యందు కేతువు సంచరించుదురు. కావున ఆయా సమయముల యందు ఆయా గ్రహములకు శాంతియొనర్చిన మేలు. ప్రతి శనివారము హనుమత్పూజా ప్రదక్షిణములతో పాటట ప్రతి నెలా తమ జన్మనక్షత్రము నాడు మరియు మాసశివరాత్రికి పరమేశ్వర ప్రీతిగ అభిషేకము చేయుట చాలా మంచిది.