సింహ రాశి:- (మ, మి, ము, మె, మో, ట, టి, టు, టే)
ఆదాయం : 8, వ్యయం : 14 - రాజపూజ్యం : 1, అవమానం : 5
వీరికి ఈ సంవత్సరము వైశాఖ, జ్యేష్ఠ, మాఘ, ఫాల్గునములందు సప్తమశని యగుటచే అనుకూలము కాదు. కొన్ని ఇబ్బందులు వచ్చును. స్వజన విరోధము, చోరాగ్నిబాధలు, ఆరోగ్యలోపములు, అకాల భోజనములు కలుగును. మిగిలిన సమయమంతా షష్ఠశని అగుటచే విశేషముగా అనుకూలమయిన కాలము. తలచిన | కార్యములు చాలా వరకు నెరవేరును. శుభకార్యానుకూలత యుండును. సుఖము, ధనధాన్యవృద్ధి, ఇష్టబంధు సమాగమము కలుగును. గృహనిర్మాణమునకు ప్రయత్నములు కలసి వస్తాయి. సంవత్సర ప్రారంభమున సప్తమగురువు అగుటచే కొంత అనుకూలత యున్ననూ, చైత్ర బహుళం నుండి అష్టమ గురువు అగుటచే చోరాగ్ని రాజబాధలు, అపనిందలు, భయము, గౌరవహాని కలుగును. చైత్ర బహుళం నుండి తృతీయ కేతువు, భాగ్యరాహువు అగుటచే పశునష్టము, ధనధాన్య నష్టము, మర్యాదాహాని, కొంతవరకు లాభము, జయము, ప్రోత్సాహము కలుగును. సంవత్సరమంతయూ దాదాపు కుజుడు అనుకూలుడు కానందున జాగ్రత్త అవసరము.
మఘా నక్షత్రము వారికి ఫాల్గునమందు జన్మతార యందు రాహువు, సంవత్సరారంభం నుండి ఆశ్వయుజ బహుళం వరకు నైధనతార యందు కేతువు సంచరించుదురు. ఆశ్వయుజ బహుళం నుండి కార్తిక శుక్లం వరకు శనివేధ, జ్యేష్ఠ బహుళం నుండి మాఘం వరకు రాహువేధయు కలదు. పూర్వఫల్గుని వారికి జ్యేష్ఠ బహుళం నుండి మాఘమాసం వరకు జన్మతార యందు రాహువు సంచరించును. ఉత్తరఫల్గుని వారికి సంవత్సరారంభము నుండి జ్యేష్ఠ శుక్లం వరకు జన్మతార యందు రాహువు సంచరించును. కావున జాగ్రత్త అవసరము. వీరు ఆయా సమయముల యందు ఆయా గ్రహములకు శాంతి యొనర్చిన మేలు జరుగును. మొత్తం మీద గురు, కుజులకు శాంతియొనర్చిన మేలు జరుగును. గురుసేవ, హనుమత్పూజా ప్రదక్షిణముల వలన మేలు జరుగును.