కన్యా రాశి:- (, పా, పి, పూ, ష, ణ, ఢ, పె, పో)
ఆదాయం : 11, వ్యయం : 5 - రాజపూజ్యం : 4, అవమానం : 5
వీరికి ఈ సంత్సరము వైశాఖ, జ్యేష్ఠ మాఘ, ఫాల్గునములందు షష్ఠశని యగుటచే విశేషముగా అనుకూలమయిన కాలము. తలచిన కార్యములు చాలావరకు నెరవేరును. శుభకార్యానుకూలత యుండును. సుఖము, ధనధాన్య వృద్ధి, ఇష్టబంధు సమాగమము, కలుగును. మిగిలిన సమయమంతయూ పంచమశని యగుటచే సంతానమునకు ఇబ్బందులు, మనస్తాపము, స్వజన విరోధము కలుగును. సర్వము వ్యతిరేకముగా తోచును. ఆస్తినష్టము, కళత్ర బంధుమూలక వ్యధ, తరచుగానేదో సమస్య, మర్యాదా భంగకరమయిన విషయములందాసక్తి కలుగును. చైత్ర బహుళం నుండి సప్తమ గురువు అయినందున అనుకూలముగ నుండును. ఆరోగ్యము చేకూరును. రాజదర్శనము, ఇష్టకార్యసిద్ధి, గౌరవమర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలు కలుగును.
చైత్ర బహుళం నుండి ద్వితీయ కేతువు, అష్టమ రాహువు అయినందున అకారణ కలహములు, అపనిందలు, చతుష్పాజ్జంతువుల వలన పీడ కలుగును. జ్యేష్ఠమాసం నుండి కుజుడు అనుకూలుడు కానందున జాగ్రత్త అవసరము. ఉత్తరఫల్గుని వారికి, సంవత్సరారంభము నుండి జ్యేష్ఠ శుక్లం వరకు | జన్మతార యందు రాహువు సంచరించును. హస్త వారికి, మార్గశిర బహుళం నుండి మాఘ బహుళం వరకు జన్మతార యందు కుజుడు, ఆశ్వయుజ బహుళం నుండి కార్తిక శుక్లం వరకు జన్మతార యందు శని, ఫాల్గునమందు నైధనతార యందు రాహువు సంచరించుదురు. చిత్ర వారికి, ఆశ్వయుజం నుండి మార్గశిర శుక్లం వరకు, తిరిగి ఫాల్గునమందు జన్మతారయందు కుజుడు, సంవత్సరారంభము నుండి ఆశ్వయుజ శుక్లం వరకు, తిరిగి కార్తిక బహుళం నుండి జన్మతార యందు శని, జ్యేష్ఠ బహుళం నుండి మాఘం వరకు నైధనతార యందు రాహువు | సంచరించుదురు. మొత్తము మీద వీరు ఈ సంవత్సరం శని, కుజ, రాహు, కేతువులకు | శాంతి యొనర్చిన మేలు హనుమతత్పూజా ప్రదక్షిణములు, గురు సేవ శ్రేయోదాయకములు.